గని ప్రమాదంలో కార్మికుని మృతి…కార్మిక సంఘాల ఆందోళన

0
11

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్

ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా సింగరేణి మందమర్రి ఏరియాలోని కేకే 5 గని పై శుక్రవారం జరిగిన గని ప్రమాదంలో రాసపల్లి శ్రావణ్ కుమార్ (32) కార్మికుడు మృతి చెందాడు. రామకృష్ణాపూర్ కు చెందిన జనరల్ అసిస్టెంట్ శ్రావణ్ కుమార్ కేకే 5 గనిలో యాక్టింగ్ ఎస్డిఎల్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తుండగా, శుక్రవారం రెండవ షిఫ్టులో సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎస్డిఎల్ యంత్రం మొరాయించడంతో, శ్రావణ్ దానిని పరిశీలిస్తుండగా, అకస్మాత్తుగా సైడ్ ఫాలై, ఒక్కసారిగా సైడ్ శ్రావణ్ పై కూలిపోయింది. దీంతో ఎస్డిఎల్ యంత్ర మధ్య ఇరుక్కుపోయిన శ్రావణ్ కుమార్ తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రమాదాన్ని గమనించిన తోటి కార్మికులు అప్రమత్తమై అతనిని గని లోపల నుండి తీసుకువచ్చి, సమీపంలోని కేకే 1 డిస్పెన్సర్ కి, అక్కడి నుండి రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రావణ్ ను కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో అతను మృతి చెందాడు.
*కార్మిక సంఘాల ఆందోళన*


యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే యాక్టింగ్ ఎస్డిఎల్ ఆపరేటర్ శ్రావణ్ కుమార్ మృతి చెందాడని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. శనివారం  గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఐటియు, టీబీజీకేఎస్ ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించి, గని ద్వారం ఎదుట ధర్నా నిర్వహించి, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, అధికారుల ఒత్తిడితోనే శ్రావణ్ కుమార్ మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలంలో సరైన వైద్య పరికరాలు అందుబాటులో లేవని, కనీసం స్ట్రక్చర్ సైతం లేకపోవడంతో ప్రమాదంలో గాయపడిన శ్రావణ్ ను ఆసుపత్రి తరలించడంలో జాప్యం జరిగిందన్నారు. సరైన సమయంలో చికిత్స అందించకపోవడంతో కార్మికుడు మృతి చెందాడని తెలిపారు. అధికారులకు ఉత్పత్తిపై ఉన్న కార్మికుల రక్షణ పై లేదని ఆరోపించారు. గని ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మరణించిన మృతుడు శ్రావణ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
*పరామర్శించిన మంత్రి వివేక్*


గని ప్రమాదంలో మృతి చెందిన శ్రావణ్ కుమార్ భౌతికకాయాన్ని రామకృష్ణాపూర్ ఆసుపత్రిలో రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సందర్శించి, శ్రావణ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని కేకే 5 గనిని సందర్శించి, గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులతో మాట్లాడి ప్రమాద వివరాలు, గనిలో రక్షణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ని ఫోను ద్వారా సంప్రదించి, శ్రావణ్ కుటుంబానికి ఆదుకోవాలని, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, ముందుగా శ్రావణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుని కుటుంబాన్ని అండగా ఉంటామని భరోసా కల్పించారు. శ్రావణ్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించడం తోపాటు సింగరేణి నుండి అన్ని బెనిఫిట్స్ అందేలా చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల కల్పిస్తున్న రక్షణ విషయంపై సింగరేణి ఏరియా జిఎం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సింగరేణి అధికారులకు ఆదేశించారు. సింగరేణి సంస్థకు లాభాలే కాకుండా, సింగరేణి కార్మికుల ప్రాణాలే ముఖ్యమన్నారు. గనిపైన కార్మికులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, సింగరేణి అధికారులతో కార్మిక సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


*శ్రావణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్*


రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో గని ప్రమాదంలో మృతిచెందిన శ్రావణ్ కుమార్ భౌతికకాయాన్ని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, నేత డాక్టర్ రాజా రమేష్ లు బిఆర్ఎస్, టిబిజికేఎస్ నాయకులు తో కలిసి శ్రావణ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుటుంబ సభ్యులు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం మూలంగానే సింగరేణిలో ప్రమాదాలు అధికమై, కార్మికుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యులని విమర్శించారు. వెంటనే బాధిత శ్రావణ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పలు కార్మిక సంఘాల నాయకులు, వివిధ రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు శ్రావణ్ భౌతిక కాయాన్ని సందర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి