
యదేచ్ఛగా మట్టి తవ్వకాలు
పట్టించుకోని స్థానిక అధికారులు
ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. పంట భూములను చదును చేస్తున్నామని కొందరు దర్జాగా మట్టి దందాను కొనసాగిస్తున్నారు. మందమర్రి మండలానికి చెందిన మట్టి మాఫియా ఈ అక్రమ తవ్వకాలు జోరుగా చేపడుతున్నారు. పంట భూముల్లో చదును చేస్తున్నామని చెప్పి కొందరు గుట్టుగా మట్టి దందా సాగిస్తున్నారు. భూమిని విచ్చలవిడిగా యంత్రాలతో తోడేస్తున్నారు. రైతుల మాటున అనుమతులతో మట్టిని తరలించి, సొమ్ము చేసుకుంటున్నారని, రోజుల తరబడి వందల కొద్దీ ట్రిప్పులు అవసరమైన వారికి రవాణా చేస్తూ, నగదుగా మార్చుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. రైతులకు సాగు యోగ్యం కోసం ఇచ్చిన సడలింపును ఆసరా చేసుకొని, అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలించి, లక్షలు గడిస్తున్నారు. ఆపాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మందమర్రి మండల పరిధిలోని పొన్నారం గ్రామ శివారుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. పట్టా భూమి పేరుతో ఏకంగా చెరువు కట్టనే తొలగించి ఇదేచ్ఛగా మట్టి మాఫియాను కొనసాగిస్తున్నారు. ఇదేమిటి అని అడిగిన వారిపై దౌర్జన్యానికి సైతం పాల్పడుతున్నారు. చెరువు కట్ట నుండి సుమారు 5 మీటర్ల వరకు కట్ట మట్టిని తొలగించవద్దని ఉన్న నిబంధనలను సైతం బేఖాతరు చేస్తూ, భూమి యజమాని అనుమతి ఇచ్చాడనే పేరుతో చెరువు కట్టకు బీటలు పడేలా మట్టిని తరలిస్తున్నారు. రానున్న వర్షాకాలంలో చెరువు కట్ట బలహీనపడి, గండి పడితే ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. మట్టి అవసరం ఉన్న వారందరికీ నల్ల రేగడి మట్టికి భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు మట్టిని తరలించి, లక్షలు గడిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్త, భూమాతకు క్షోభను మిగిలిస్తున్నారు. పట్టించు కోవలసిన స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు నుండే యదేచ్చగా భారీ మొత్తంలో మట్టిని తరలిస్తున్న సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి ఫోన్ ద్వారా సంప్రదించాలని ప్రయత్నించగా, ఎన్నిసార్లు ఫోన్ చేసిన సదురు పంచాయతీ కార్యదర్శి స్పందించలేదు. పల్లెకు గుండెకాయ వంటి చెరువును కాపాడవలసిన ప్రభుత్వ అధికారై ఉండి గత కొద్ది రోజులుగా పంచాయతీ కార్యాలయం ముందు నుండే అక్రమ మట్టి రవాణా జరుగుతున్న పై అధికార దృష్టికి తీసుకు వెళ్లకుండా “మామూళ్లు”గా మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు గ్రామంలో గుప్పుమంటున్నాయి. ఈ అక్రమ తవ్వకాలపై పలువురు సంబందిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారమిచ్చిన స్థానిక కిందిస్థాయి సిబ్బంది సహకారంతో కొద్దిసేపు పనులు నిలిపివేసి, మరల యదేచ్చగా మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పై అధికారులను సైతం మభ్య పెట్టెలా కిందిస్థాయి సిబ్బంది వ్యవహరించే తీరుతో ప్రభుత్వ యంత్రాంగంపై గ్రామస్తుల్లో ఉన్న నమ్మకం సడలంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం పట్ల అక్రమ మట్టి రవాణా చేస్తున్న వారు సైతం అలుసుగా తీసుకొని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కించపరిచేలా మాట్లాడడం కొసమెరుపు. కొన్ని సందర్భాల్లో కొంతమంది అధికారులు భూమి చదును చేస్తున్నారని, వారి పట్టా భూమిలో వారు తవ్వుకుంటున్నారు, మీకెందుకని చెప్పి, తప్పించుకోవడం పరిపాటిగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారులకు అన్ని తెలిసిన పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుందని గ్రామస్తులు తెలిపారు. భూమి చదును కోసం మట్టిని అమ్ముకోవడం, వెంచర్లకు,ఫాంహౌస్‌లకు మట్టిని తరలించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా యథేచ్చగా మట్టి తవ్వకాలు జరుపుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు.
*సెలవు రోజుల్లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా…*
నిబంధనల ప్రకారం రైతులు తమ భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు ఎత్తయిన గుట్టలు, కొండలు, ఎగుడు, దిగుడు నేలలను సమం చేసుకునేందుకు గనుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తవ్వకం సైతం నిబంధనల మేరకు నిర్ణీత లోతు మాత్రమే తవ్వాలి, భారీ కందకాలు తవ్వరాదు. కానీ ఇవేమీ మట్టిని అక్రమంగా తరలించేవారు పాటించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు రెండో శనివారం, ఆదివారం, రెండు రోజులు సెలవు దినం కావడంతో పాటు సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మూడు రోజులు వరుసగా సెలవు లభించడంతో అదును చూసి మట్టి మాఫియా సెలవు రోజుల్లోనే రెచ్చి పోతున్నారు. సెలవు రోజు కావడం అధికార యంత్రాంగం ఉండకపోవడంతో వారికి వరంగా మారుతోంది. నేరుగా పట్టపగలే మట్టి తవ్వకాలను చేపడుతున్నారు. సెలవు రోజైతే ఎవరూ ఉండరని, అందుకే అదేరోజు మట్టి తవ్వకాలు జరపాలని సంబందిత కొంతమంది అధికారులు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మండలంలోని పొన్నారం, గుడిపల్లి, ఆదిల్పెట్ ,సండ్రోన్ పల్లి, అందుగుల పేట, బొక్కలగుట్ట, ఊరు మందమర్రి తదితర చాలా ప్రాంతాలలో యథేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్ లో మట్టిని పరిమితికి మించి నింపడంతో రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఎక్కువ కాలం నిలవాల్సిన రోడ్లు ఇలాంటి పనుల వల్ల త్వరగా పాడవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వాహనదారులు, పంటల సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రభుత్వం రోడ్లు మరమత్తులు చేయడానికి అధికంగా ప్రజల సొమ్మును ఖర్చు చేయాలసి వస్తుంది.కొందరి అక్రమార్కుల స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేయడం మంచిదికాదని, ప్రకృతి పరంగా ఏర్పడిన మట్టిని తవ్వి అమ్మకాలు చేయడంతో పర్యావరణం దారుణంగా దెబ్బతింటుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.ఇప్పటికైనా అటూ ఇసుక, ఇటూ మట్టి తవ్వకాలపై ఉన్నతాధికారులు స్పందించి, రెచ్చిపోతున్న ఇసుక,మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపి, పర్యావరణాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.