
సిఐ చేతుల మీదుగా వృద్ధ దంపతులకు ఆర్థిక సహాయం అందజేత
ఉదయక్రాంతి :- పేదరికంతో బాధపడుతున్న వృద్ధ దంపతులకు సహాయం అందించి మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ పోలీస్ స్టేషన్లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్న దాసరి శ్రావణ్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణం సింగరేణి ఏరియా ఆసుపత్రి సమీపంలో నివాసముంటున్న అటకాపురం రాజం, రాజేశ్వరి ల దీనస్థితి పై ఇటీవల వివిధ పత్రికలో వచ్చిన వార్తాపత్రిక కథనాలకు స్పందించిన హోం గార్డు శ్రావణ్ కుమార్ తనతోపాటు మరికొంత మంది దాతలను సహాయంతో సేకరించిన 8005 రూపాయల నగదును, 75 కిలోల బియ్యాన్ని, నిత్యవసర సరుకులను, దుప్పట్లు, పండ్లను శనివారం మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి చేతుల మీదుగా వారి నివాసంలో వృద్ధ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, చేతికి అందించిన కొడుకు మృతిచెందగా, భార్య పక్షవాతంతో బాధపడుతుండగా, ఒక చెయ్యి లేని రాజం దీనస్థితిని తెలుసుకొని, ముందుకొచ్చి సహాయం అందించడం అభినందనీయమని తెలిపారు. ఇదేవిధంగా దాతలు ముందుకు వచ్చి వారికి సహాయం అందించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, దాతలు ఎవరైనా వృద్ధ దంపతులకు తమ సహాయ సహకారాలు అందించాలంటే ఫోన్ పే నెంబర్ 9393941940 ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల గౌతం చారి, వంశీ, ఎండి సద్దాం లు పాల్గొన్నారు.