
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్భూ గుప్తా
ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్భూ గుప్తా తెలిపారు. శనివారం ఆమె క్యాతనపల్లిలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో ఏపిఓ, పివిటిజి మనోహర్, ఏటిడిఓ పురుషోత్తం, నాయక్ పోడ్ సంఘం ప్రతినిధులతో కలిసి పాల్గొని, కాలభైరవ స్వామి, మైసమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను అధికారులు సమన్వయంతో కృషి చేసి, విజయవంతం చేయాలని తెలిపారు. జాతరలో పారిశుద్ధ్యం, భక్తులకు త్రాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు భోజన ఏర్పాట్లు చేయాలని, వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి, అత్యవసర వైద్య సేవలు అందించాలన్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు, జాతర కమిటీ ప్రతినిధులు అధికార యంత్రాంగానికి సహకరిస్తూ, జాతర ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగే విధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.