
కారణమైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి
ఉదయక్రాంతి :- మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని జిల్లా మాత శిశు ఆసుపత్రికి ప్రసవం కోసం బుధవారం వచ్చిన నెన్నల మండలం మైలారం గ్రామానికి చెందిన గావిడి సుమలత కు సకాలంలో వైద్యం అందించకపోవడంతో నిండు గర్భిణిగా ఉన్న సుమలత కడుపులోనే శిశువు మరణించడం జరిగిందని, ఈ సంఘటనకు బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని సిపిఎం బృందం శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సంకె రవి మాట్లాడుతూ, రెండు రోజులుగా బాధితురాలు,కుటుంబ సభ్యులు వైద్యులను ఎంత వేడుకున్న కనికరం చూపించలేదని, చివరికి శుక్రవారం ఆపరేషన్ చేసి, కడుపులో చనిపోయిన శిశువును తీసి, కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. చనిపోయిన శిశువును పట్టుకొని, కుటుంబ సభ్యులు ఇక్కడనే ఉంటే గొడవలు జరగడంతో పాటు తమ నిర్లక్ష్య దోరణి బయటపడి, ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోననే భయంతో మరణించిన శిశువును ఇతర కుటుంబ సభ్యులతో దహన సంస్కారణలకు ఇంటికి పంపించడం జరిగిందన్నారు. తొలి కాన్పుతో బిడ్డ కోసం ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఆనందం వైద్యుల నిర్లక్ష్యం మూలంగా గాలిలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈసంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్, ఐఆర్సిపి నాయకులు కామిల్లా జయరావ్ లు పాల్గొన్నారు.