
మహాసభల వాల్ పోస్టర్లు విడుదల
ఉదయక్రాంతి :- అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) 19వ త్రైవార్షిక మహాసభలు ఫిబ్రవరి 12, 13న మహారాష్ట్ర నాగపూర్ లోని రేషింబాగ్ లో నిర్వహించడం జరుగుతుందని కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి లు తెలిపారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని యూనియన్ కేంద్ర కార్యాలయంలో మహాసభ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ మహాసభలను కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించగా, ముఖ్య అతిథిగా బిఎంఎస్ ఆల్ ఇండియా ఉప ప్రధాన కార్యదర్శి సురేంద్ర కుమార్ పాండే, గౌరవ అతిథిగా బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి, బొగ్గు పరిశ్రమల బిఎంఎస్ ఇంచార్జీ కొత్తకాపు లక్ష్మారెడ్డి లు హాజరవుతున్నారన్నారు. కోలిండియా, సింగరేణి కాలరీస్, నైవేలి లిగ్నెట్ కంపెనీలకు చెందిన 8 అనుబంధ సంస్థలు, సీఎంపిఎఫ్ చెందిన 8 అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న మహిళలు, సుమారు 700 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరు కానున్నారని తెలిపారు. భద్రత, వేగంగా క్షీణిస్తున్న శాశ్వత మానవ శక్తి, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లేబర్, కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ, మెడికేర్, సిఎంపిఎఫ్ పెన్షన్ మొదలైన సమస్యలపై మహాసభలో చర్చించి, భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 12న నాగపూర్ లో బిఎంఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, ఫిబ్రవరి 13న ఆఫీస్ బేరర్ల ఎన్నిక నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆకుల హరిణ్, మాదాసు రవీందర్, కర్రావుల మహేష్, వడ్డేపల్లి కుమారస్వామి, సాయవేని సతీష్, తాట్ల లక్ష్మయ్య, పల్లె శ్రీనివాస్, చిన్న సతీష్, చీకటి మల్లేశం లు పాల్గొన్నారు.