
ఏఐటీయూసీ ఆరోపణలు ఖండిస్తున్నాం
ఉదయక్రాంతి :- ఏఐటియుసి నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లాలోని సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే 1ఏ గనిపై సిఐటియు యూనియన్ పై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, ఏరియా కార్యదర్శి అంబాల శ్రీనివాస్ లు తెలిపారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, విమర్శించడానికి ఎవరూ లేక, సిఐటియు కు కార్మికుల్లో వస్తున్న ఆదరణ చూసి, గుర్తింపు సంఘమైన ఏఐటియుసి శ్రీరాంపూర్ నాయకులు సిఐటియు పై నిరాధార ఆరోపణలు చేశారన్నారు. వారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఏఐటీయూసీ నాయకులు మాదిరి మెడికల్ అన్ ఫీట్ లు చేయిస్తామని డబ్బులు తీసుకొని, మోసం చేస్తున్నారనే అపవాదు సిఐటియు కు లేదన్నారు. ఏఐటీయూసీ మాదిరిగా సిఐటియు డిప్యూటేషన్లు, ట్రాన్స్ ఫర్లు వంటి పైరవీలు చేయడం లేదని, కార్మికుల నుండి చందాలు వసూలు చేసి, చనిపోయిన వారి పేరు పైన బిల్డింగులు కట్టి, కిరాయికి ఇచ్చుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటామనే అపవాదులు సిఐటియు కు లేవన్నారు. కార్మికుల నుండి చందాలతో పాటు యూనియన్ మెంబర్షిప్ పేరు మీద సంవత్సరానికి 1100 రూపాయలు వసూళ్లకు ఏఐటీయూసీ నాయకులు తెరలేపారని ఆరోపించారు. సిఐటియు యూనియన్ కాంట్రాక్టర్ల నుండి డబ్బులు తీసుకున్నట్లు అబద్ధపు ప్రచార చేసిన ఏఐటీయూసీ నాయకులు, దానిని నిరూపించాలని డిమాండ్ చేశారు. వారు చేసిన విమర్శలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఒకవేళ బహిరంగ చర్చకు వారు రాకపోతే బేషరతుగా సిఐటియు పై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.