
ఉదయక్రాంతి :- రాబోవు సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపిటిసి, జెడ్పిటిసి, స్థానిక సంస్థల ఎన్నికలలో విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది, తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ సూచించారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, ఎస్సి కార్పొరేషన్ ఈడి, దండేపల్లి మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ లతో కలిసి స్టేజ్-1, 2 ఆర్ఓ లు, స్టేజ్-1 ఏఆర్ఓ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, హ్యాండ్ బుక్ నిర్వహణ, ఎన్నికల ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ మాట్లాడుతూ, జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని, ఈ క్రమంలో విధులు నిర్వహించే అధికారులు తమకు అందిస్తున్న శిక్షణను ఏకాగ్రతతో నేర్చుకోవాలని, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసేంత వరకు అధికారులు, సిబ్బందికి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. నామినేషన్, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలో నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్లలో 16 మండలాలు, 2 వేల 680 వార్డులు, 306 గ్రామపంచాయతీలు, 47 క్లస్టర్లు, 129 ఎంపిటిసి, 16 జెడ్పిటిసి లుగా ఎన్నికలు జరుగుతాయని, సర్పంచ్, ఎంపిటిసి స్థానాలకు గులాబి రంగు బ్యాలెట్ పేపర్, జెడ్పిటిసి, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ వినియోగించడం జరుగుతుందని వివరించారు. ఎన్నికలలో భాగంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, జోనల్, ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్, సహాయకులు ఇతర సిబ్బందిని నియమించడం జరుగుతుందని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఫారాలు, కవర్లు, పోలింగ్ సామాగ్రి అవసరమైన మేరకు సమకూర్చడంతో పాటు అదనంగా అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చునన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


