
ఉదయక్రాంతి :- గనిలో యాజమాన్యం తన అవసరాలకు కార్మికులను వివిధ షిఫ్ట్ లల్లో, రోజూ వారి విధులలో సర్దుబాటు చేయడం సాధారణమైన విషయమే. కొన్నిసార్లు గెలిచిన సంఘాల వల్ల సైతం విధుల మార్పులు జరుగుతాయని అపవాదులు సైతం లేకపోలేదు. కానీ గత నెలలో ఏరియాలో దూరంగా గల ఒక గనిలో కొందరు కార్మికులను సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా వారి విధుల్లో మార్పు చేయడం జరిగింది. కొందరు జూనియర్లు వివిధ తేలికైన పనులలో ఉంటున్నా, వారిని కాదని సీనియర్లను మమ్మల్ని ఈ విధంగా కష్టమైన పనికి పెట్టడం సరైన విధానం కాదంటూ తీవ్ర మానసిక వేదనకు గురవుతూ అందులో కొందరు కార్మికులు ఆ గని మేనేజర్ కి వినతి పత్రం అందజేసినట్లు సమాచారం. వినతి పత్రం ఇచ్చినప్పటికీ సమస్య ఇంకా సద్దుమనగక పోవడం గమనార్హం. ఇంత జరుగుతున్న దీనిపైన గెలిచిన సంఘం నాయకులు యాజమాన్యంతో మేము సంప్రదింపులు చేస్తున్నామని చెప్పడం తప్ప, సమస్య పరిష్కరించడం లేదని పలువురు కార్మికులు వాపోతున్నారు. ఒకవైపు గైర్హాజరు పెరుగుతున్నదని కౌన్సిలింగ్ లు చేసే యాజమాన్యం ఇలా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా కష్టమైన పనులకు పంపడం వల్ల గైర్హాజరులు సైతం పెరిగే అవకాశం లేకపోలేదని, ఇలాంటి ప్రొడక్షన్ పీరియడ్ సమయంలో యాజమాన్యం ఇలాంటి చర్యలకు పూనుకోవడం సరైనది కాదని, సదరు కార్మికులను యధావిధిగా పాత పనులకు పంపేలా చూడాలని ఆ కార్మికులు కోరుకుంటున్నారు. ఇదంతా గెలిచిన సంఘం అండదండలతోనే యాజమాన్యం చేస్తున్నదని విపక్ష కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.