
ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ కేకే 2 వారసంతలో బుధవారం పాము కలకలం సృష్టించింది. పట్టణంలోని పాత కేకే 2 గని సమీపంలో కొన్ని సంవత్సరాలుగా ప్రతి బుధవారం వారసంత నిర్వహిస్తుండేవారు. అదేవిధంగా పట్టణంలోని పాలచెట్టు ఎంవీటీసీ పక్కన సైతం ప్రతి గురువారం వారసంతా నిర్వహించేవారు. ఈ వార సంతలకు మార్కెట్లోని చిరు వ్యాపారులతో పాటు చుట్టుపక్కల పల్లెల నుండి సైతం ప్రజలు సంతకు వచ్చి, కూరగాయలు విక్రయిస్తుండగా ప్రజలు రైతుల వద్దనుండి నేరుగా కూరగాయలను కొనుగోలు చేస్తారు. కరోన అనంతరం పట్టణంలోని పాలచెట్టు ప్రాంతంలో నిర్వహించే వారసంత పూర్తిగా నిర్వహించకపోవడంతో పట్టణంలో ప్రతి బుధవారం కొనసాగుతుంది. ఈ సంతకు ప్రతి సంవత్సరం మున్సిపల్ అధికారులు తైబజార్ వేలంపాట నిర్వహిస్తుండగా, వేలంపాట దక్కించుకున్న కాంట్రాక్టర్ సంతలో మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతుంది. వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో బుధవారం నిర్వహిస్తున్న వారసంతలో ఒక్కసారిగా పాము అలజడి సృష్టించింది. దీంతో సంతలో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులతో పాటు సంతలో కొనుగోలు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర భయాందోళన గురయ్యారు. దీనికి తోడు సంతలో సరైన విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో తరచుగా పోయే విద్యుత్ తో ఎక్కడ పాముకాటు గురి అవుతామని ప్రజలు ఆందోళన చెందారు. మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు రక్షణ కల్పించడంలో, సంత లో సౌకర్యాలు కల్పించడంలో చూపడం లేదని పలువురు వాపోయారు. కొన్ని సంవత్సరాలుగా సంత నిర్వహిస్తున్నప్పటికీ నేటికీ సంతలో ఎలాంటి సరైన సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, వార సంతలో శాశ్వతంగా కనీస సౌకర్యాలు కల్పించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.
