


డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత
బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్
హోరాహోరీగా సాగిన పోలీస్ అండ్ ప్రెస్ క్రికెట్ టోర్నమెంట్
ఒక పరుగు తేడాతో విజయం సాధించిన పోలీస్ జట్టు
ఉదయక్రాంతి:- క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం చేకూరుతుందని, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ తెలిపారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, పట్టణ ప్రెస్ క్లబ్ సహకారంతో పోలీస్ అండ్ ప్రెస్ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించగా, మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచిన ప్రెస్ క్లబ్ జట్టు ఫిల్డింగ్ ఎంచుకోగా, పోలీస్ జట్టు బ్యాటింగ్ చేసి, నిర్ణీత 14 ఓవర్లో 111 రన్ లు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ప్రెస్ క్లబ్ జట్టు 110 పరుగులు సాధించడంతో ఒక్క పరుగు తేడాతో ప్రెస్ క్లబ్ జట్టు పరాజయం పాలై, పోలీస్ జట్టు విజయం సాధించింది. అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాల ముప్పు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో యువతను నేర మార్గము నుండి మరల్చడానికి, సత్ప్రవర్తన కలిగిన యువతను తీర్చిదిద్దేందుకు, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. మాదక దవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన పెంచేందుకు యువత, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని. అందులో భాగంగానే సమాజ శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తున్న పోలీస్, ప్రెస్ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. మాదకద్రవ్యాల నిరోధానికి ప్రజలు మరింత అవగాహన పెంచేందుకు క్రికెట్ టోర్నమెంట్ ను సైతం సోమవారం నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు. మాదకద్రవ్యాలు యువతను జీవితానికి దూరం చేస్తున్నాయని, అవి వ్యక్తినే కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేసే ముప్పుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన పోలీసులదే కాకుండా ప్రజలందరి బాధ్యత అని, డ్రగ్స్ రహిత సర్కిల్ గా మందమర్రి సర్కిల్ ను నిలపాలని పిలుపునిచ్చారు. సమాజంలో డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రజలందరూ ముందుకు రావాలన్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలతో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, యువత చిన్న వయస్సులోనే చెడు వ్యసనాల బారిన పడటంతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వ్యసనాన్ని అరికట్టేందుకు ప్రజలు చైతన్యవంతంగా ముందుకు రావాలని సూచించారు. నేటి క్రికెట్ మ్యాచ్ కు అన్ని విధాలుగా సహకరించిన మందమర్రి సీఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, సింగరేణి యాజమాన్యానికి, పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మ్యాచ్లో గెలిచిన పోలీస్ జట్టుకు విన్నింగ్ ట్రోఫీని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా రన్నర్ గా నిలిచిన ప్రెస్ క్లబ్ జట్టుకు రన్నర్ ట్రోఫీని అందించి, ఇదే క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ జరగబోయే మరిన్ని మ్యాచ్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మ్యాచ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోపీని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐ లు వి ప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, ప్రెస్ మిత్రులు పాల్గొన్నారు.