
ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో షేక్ జిలాని (30) అనే యువకుడు మృతి చెందడం జరిగిందని పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏరియా కేకే ఓసిపి లో లారీ డ్రైవర్లు గా పని చేస్తున్న అన్నదమ్ములైన షేక్ ముగ్ధం, షేక్ జిలానీలు ఇరువురు తమ ద్విచక్ర వాహనం (ఏపీ 01క్యూ8743)పై పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్లి, తిరిగి వారి మేనమామ ఇంటికి బెల్లంపల్లికి వెళుతుండగా పట్టణ ఫ్లైఓవర్ పైన ద్విచక్ర వాహనం అదుపుతప్పి, కుడివైపు ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో వాహన నడుపుతున్న షేక్ జిలాని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో షేక్ ముగ్ధం తీవ్ర గాయాలపాలు కాగా అతనిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతుని మేనబావమరిది షేక్ సలీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్ రాజశేఖర్ తెలిపారు.