తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తప్పులు తడకగా ఉన్న కులగననను వెంటనే రద్దు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రచార కార్యదర్శి ఓరగంటి భార్గవరామ్ కోరారు. అయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మళ్ళీ కుల సర్వే చేసి తన నిజాయితీ నిబద్ధతను నిరూపించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించడం హేతుబద్ధమైన పరిష్కారం కాదని అన్నారు. ప్రభుత్వం ఏదైనా చట్టబద్ధంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు పరచాలని కోరారు. బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ ఉపాధి విద్య రంగాలలో అవకాశాలు చట్టబద్ధంగా కల్పించాలని, కుల గణన సర్వే సరైన రీతిలో జరగలేదని, దాన్ని వెంటనే రద్దు పరచాలని, మళ్లీ రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేపట్టి సమగ్రమైన రీతిలో స్వచ్ఛమైన విధంగా జనగణన జరగాలని విజ్ఞప్తి చేసారు. బీసీ హక్కులకు భంగం కలిగిస్తే బీసీలు అగ్ని కనికలై పోరాటం చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికైనా నిజాయితీగా కులగననను చేయాలని, బీసీ కుల గణనకు చట్టబద్ధం అయ్యేంతవరకు సర్పంచ్ ఎన్నికలు జెడ్పిటిసి ఎంపీటీసీ అన్ని రకాల స్థానిక సంస్థ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ తెలిపారు. బీసీ హక్కుల కోసం ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మా హక్కులను నెరవేర్చాలన్నారు. రిజర్వేషన్లను ఇవ్వాలని ఉన్న జనాభా కు అనుగుణంగా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర లో బీసీల జనాభాను తగ్గించి ఓసీల జనాభాను పెంచుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో అగ్రవర్ణాలు గెలిపించుకోవడానికి మోసపూరితమైన కుల గణన అని రాష్ట్ర శాఖ ప్రచార కార్యదర్శి ఓరగంటి భార్గవరామ్ మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో బంగుడపు తిరుపతి, కాళ్ల రాజయ్య, కందుకూరి తిరుపతి, సాన స్వామి, ఓరగంటి సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
