
ఉదయక్రాంతి :- మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఈ యాసంగికి అత్యధిక సాగు విస్తీర్ణం కలిగిన రెండు రెవెన్యూ గ్రామాలైన మందమర్రి, తిమ్మాపూర్ గ్రామాల్లో డిజిటల్ క్రాప్ సర్వే విధానంతో పంటల నమోదు చేస్తున్నామని, రైతులు డిజిటల్ క్రాప్ సర్వేకు సహకరించాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి కోరారు. మంగళవారం ఆయా గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఈఓ ముత్యం తిరుపతి మాట్లాడుతూ,డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా ఎంపిక చేయబడిన గ్రామాల్లో ప్రతి సర్వే నెంబరు,ప్రతి సర్వే సబ్ డివిజన్ నెంబర్ల వారీగా పంటల సాగు విస్తీర్ణాన్ని,పంట రకం,సాగు విధానం,నీటి వసతి, తదితర వివరాలను పంట క్షేత్రాల వద్దకు వెళ్లి, పక్కాగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ విదంగా సేకరించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన ఏఈఓ లాగర్ ఆప్ నందు పొందుపరచుట జరుగుతుందన్నారు. ఈ డిజిటల్ క్రాప్ సర్వేతో సేకరించిన పంటల గణాంకాలు పంటల సాగు వివరాలతో పాటు,పంటల దిగుబడులను ఖచ్చితంగా అంచనా వేయుటకు,పంట కొనుగోలు అంచనాకు,పంటల బీమా అమలుకు,ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లినప్పుడు ఖచ్చితమైన అంచనా వేయుటకు ఉపయోగపడుతుందని వివరించారు. ఇప్పటి వరకు దాదాపుగా 2000 ఎకరాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు.