కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చెయ్యి
ఆరు గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం
సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి
కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రజల కోసమే బడ్జెట్ కేటాయింపులను ఉపయోగించుకుంటుందని, కేంద్ర ప్రభుత్వం దేశానికి ప్రతినిధి కానట్టుగా, కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ప్రభుత్వంగా కొనసాగుతుందని, అందుకోసమే రాష్ట్రానికి బడ్జెట్లో మొండి చేయ్యి చూపెట్టిందని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి ఆరోపించారు. జిల్లాలోని చెన్నూరు పట్టణంలో గురువారం నిర్వహించిన సిపిఎం పార్టీ చెన్నూరు ఏరియా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ, ఆరోగ్య, విద్యా, సంక్షేమ పథకాలకు నిధులను తగ్గించి, కార్పొరేట్ సంస్థకు లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం కలిగిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని ఆరోపించారు. రైతులు పంటలకు మద్దతు ధర కావాలని, వ్యవసాయ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసినప్పటికీ, బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకుండా, వ్యవసాయ రంగానికి భారీగా నిధులు తగ్గించిందన్నారు. భీమా రంగంలో ఉన్న డబ్బులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం కోసం 100 శాతం ఎఫ్డ్ఐ అమలు చేయాలని నిర్ణయించిందని విమర్శించారు. అదేవిధంగా సంక్షేమ పథకాల్లో సైతం పోత విధించిందన్నారు. రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందే తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ రెండుసార్లు గ్రామ సభలు నిర్వహించి, దరఖాస్తు స్వీకరించిందని ప్రజలు ఎంత ఆశతో దరఖాస్తు పెట్టుకున్నారని కానీ ప్రభుత్వం న్యాయం చేసే విధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులపై సిపిఎం పార్టీ రాబోయే కాలంలో నిర్మించబోయే పోరాటాలకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చెన్నూరు ఏరియా నాయకులు బోడంకి చందు, ఉమారాణి, రవి సరిత, నాగేష్, చంద్రన్న, సత్యం లు పాల్గొన్నారు.
