
*ఉదయక్రాంతి* :- కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయ్యి పెట్టిందని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ లు ఆరోపించారు. ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎంసిపిఐయు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రం ప్రవేశపెట్టిన 50 లక్షల 65 కోట్ల రూపాయల బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి కనీసం కేటాయింపులు లేకపోవడం అన్యాయమని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ రూపొందించకుండా, దోపిడి వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం సిగ్గుచేటు అన్నారు. ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్ను తెలంగాణ పట్ల వివక్షపూరిత కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కోసమే బడ్జెట్ అన్నట్లుగా బడ్జెట్ ను ప్రవేశపెట్టి, రైతులను, కూలీలను, కార్మికులను, మహిళలను, సామాజిక తరగతులు విస్మరించారని ఆరోపించారు. కనీసం గతంలో కేటాయించిన విధంగా సైతం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకుండా, కోతులు విధించి, ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా, దోపిడి వర్గాల పాలకులుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరూపించుకుందని ఎద్దేవా చేశారు. దేశానికి వెన్ను ముక్కైనా వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు నిధులు పెంచాల్సింది పోయి, సబ్సిడీలు తగ్గించారని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో కూలీలకు ఉపాధి దొరకకుండా బడ్జెట్లో కోత విధించారని విమర్శించారు. ధరలను నియంత్రణకు బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు. ఈ బడ్జెట్ పేదలపై భారాలు, కార్పొరేట్ శక్తులకు వరాలు అన్న మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. ఒకవైపు రాష్ట్రానికి ఏ విధమైన బడ్జెట్ కేటాయింపు లేకుండా తీరని అన్యాయానికి వివక్షత గురి చేశారని, రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీ లు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఒరిగింది ఏమీ లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పరిపూర్ణంగా అమలు చేసే విధంగా బడ్జెట్ లేదని, ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, రాష్ట్ర అభివృద్ధికి, వివిధ తరగతుల వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ప్రకారం నిధులు కేటాయించే విధంగా పోరాటాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐయు బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్, తొగరి రాహుల్, ధోనే కృష్ణ, ఆకాష్, రవి లు పాల్గొన్నారు.