ఐక్య పోరాటాల స్ఫూర్తితో సిఐటియు ప్రయాణం…..నేడు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం

0
23

కార్మికుల ఆదరాభిమానాలు పొందుతున్న యూనియన్

ఉదయక్రాంతి:- దేశంలో తొలి కార్మిక సంఘం ఏఐటియుసి ఆవిర్భావించిన తర్వాత కార్మిక హక్కుల కోసం పోరాడి అనేక హక్కులను సైతం సాధించుకోవడం జరిగింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కార్మిక సంఘాలను చీల్చి, కార్మికుల మధ్య విచ్ఛిన్నం చేయడానికి ఆయా ప్రభుత్వాలు వారికి అనుకూలమైన సిద్ధాంతాలతో కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో కార్మికులు ఏవైనా హక్కుల కోసం సమ్మెలు, పోరాటాలు చేసే సందర్భంలో ప్రభుత్వాలు తమకు అనుకూలమైన సంఘాలతో కార్మికులను మభ్యపెట్టి, ప్రభుత్వాలు తన ఆధిపత్యాన్ని కొనసాగించేవి. దేశంలో ఎమర్జెన్సీ కాలంలో ఏఐటీయూసీ లోని కొంతమంది నేతలు ఎమర్జెన్సీ ని సమర్థించగా, మరికొంతమంది వ్యతిరేకించారు. ఆ పరిణామాలతో కార్మిక సంఘాల మధ్య కార్మికుల మధ్య అనైక్యత వస్తుందని గమనించిన కొంతమంది కార్మిక సంఘం నాయకులు, ఏఐటియుసి సైతం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుందని గమనించి, కార్మికుల ఐక్యత కొరకు మే 30, 1970 సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) ని ఏర్పాటు చేయడం జరిగింది. సిఐటియు ఏర్పాటు చేసే తరుణంలో దేశంలో అనేక కార్మిక సంఘాలు చలామణిలో ఉండేవి. దేశంలో అనేక కార్మిక సంఘాలు ఉండగా, కొత్తగా వచ్చిన సిఐటియు ఏమి చేస్తుందని ఆ సమయంలో సిఐటియు నేతలను అవహేళన చేసిన సందర్భాలు అనేకం కలవు. ఆ సందర్భంలోనే నిర్వహించిన రైల్వే సమ్మెలో ప్రభుత్వం ఒత్తిడి మేరకు చాలామంది రైల్వే కార్మిక నాయకులు సమ్మెకు దూరంగా ఉన్న సందర్భంలో అప్పుడే ఆవిర్భావించిన సిఐటియు ఆ రైల్వే కార్మిక సంఘాల నాయకులకు మద్దతుగా ఉండి, అన్ని కార్మిక సంఘాల మధ్య ఐక్యతను తీసుకురావడంతో ఆనాటి దేశ వ్యాప్త సమ్మె విజయవంతం అయ్యింది. దీంతో కార్మికుల్లో, కార్మిక సంఘాలలో సిఐటియు కు పూర్తి ఆదరణ, అభిమానం ఏర్పడింది. అప్పటినుండి ఏ దేశవ్యాప్త సమ్మె అయినా విజయవంతం చేయాలంటే సిఐటియు ముందుండాలని అభిప్రాయం కార్మికులు, కార్మిక సంఘాలలో కలిగింది. సింగరేణిలో ఏఐటియుసి కి అనుబంధంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కొనసాగుతూ ఉండేది,  దీంతో పాటే హెచ్ఎంఎస్, ఐఎన్టియుసి, బిఎంఎస్ అనుబంధ సంఘాలు సైతం సింగరేణిలో కొనసాగుతూ ఉండేవి. ఆ సమయంలోనే ఏఐటీయూసీ నేత శేషగిరిరావు సమకాలికుడైన పర్స సత్యనారాయణ, జార్జ్ తదితర కార్మిక సంఘం నేతలు సిఐటియు కు అనుబంధంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. సిఐటియు చూపెట్టిన తోవలోనే సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ పయనిస్తూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటంలో కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఐక్య పోరాటాల ఆవశ్యకతను వివరిస్తూ, పోరాటాలు నిర్వహించేది. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఏదైనా విషయం చెప్పిందంటే అది నిజమే అనే భావన కార్మికుల్లో, కార్మిక సంఘాల్లో కలిగేలా యూనియన్ నేతలు కృషి చేశారు. ఇదే ధోరణిని నాటి తరం నుండి నేటి తరం వరకు యూనియన్ నేతలు కాపాడుకుంటూ వస్తూ, కార్మికుల ఆదరాభిమానాలను చొరగొంటున్నారు. ఆ సమయంలోనే ఏడవ వేజ్ బోర్డు ఒప్పందం చేసుకొనే సమయంలో వేజ్ బోర్డ్ లోని అన్ని కార్మిక సంఘాలు ఒప్పందంపై సంతకం చేసిన, ఒప్పందం కార్మికులకు ప్రయోజనం లేదని గుర్తించిన సిఐటియు నేతలు మాత్రం ఒప్పందంపై సంతకం చేయకుండానే సమావేశం నుండి బయటకు విచ్చేసి, వేజ్ బోర్డ్ లో జరిగిన విషయాలను కార్మికులకు వివరిస్తూ, వారిని చైతన్య పరచడంతో, సిఐటియు పోరాటంతో ఏడవ వేజ్ బోర్డ్ లో కార్మికులకు మూడు ఇంక్రిమెంట్లు లభించడం తోపాటు క్యూమిమిలేటివ్ ఇంక్రిమెంట్ సైతం ప్రతి కార్మికునికి అతని బేసిక్ పైన మూడు శాతం లభించే ఒప్పందం సిఐటియు కృషి వలనే లభించింది. తాజాగా సకల జనుల సమ్మె పోరాటంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు సమ్మె కాలపు వేతనాలు చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ సింగరేణి యాజమాన్యం మాత్రం సమ్మెకు ముందు రెండు రోజులు ముందు మాస్టర్ లేదా లీవ్ ఉన్న వారికే సమ్మె కాలం వేతనం చెల్లిస్తామని నిబంధనలతో కూడిన ఉత్తర్వులను జారీ చేయడంతో, ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు సమస్యను యజమాన్యం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లడంతో, యాజమాన్యం నిబంధనను సవరిస్తూ దాదాపు అందరి కార్మికులకు సమ్మె కాలపు వేతనాలు అందేలా మరల ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆగ్రహించిన సింగరేణి యాజమాన్యం యూనియన్ నేతలను బదిలీలు చేయడంతో కోర్టుకు వెళ్లి మరి బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకునేలా యూనియన్ పోరాటం చేసింది. ఒక్కప్పుడు సీఎంపిఎఫ్ ట్రస్ట్ బోర్డులో సిఐటియు కి సభ్యత్వం లేకుండే, సభ్యత్వం లభించిన అనంతరం సీఎంపిఎఫ్ లెక్కలను పరిశీలించి, పెన్షన్ ఫండ్ లోటు బడ్జెట్ లో ఉందని గ్రహించిన సిఐటియు నాయకులు, పెన్షన్ లోటు బడ్జెట్ ను తగ్గించే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి చేయడం జరిగింది. సిఐటియు ఒత్తిడితో స్పందించిన యాజమాన్యం పెన్షన్ ఫండ్ లో ఎంత బడ్జెట్ ఉంది, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఇంకా ఎన్ని సంవత్సరాలకు పెన్షన్ ఫండ్ సరిపోతుందనే విషయాలపై యాజమాన్యం సైతం అవగాహనకు వచ్చి, పెన్షన్ ఫండ్ లోటును పూరించేలా చర్యలు చేపట్టింది. అదేవిధంగా కార్మికులకు చెల్లించే సీఎంపిఎఫ్ వడ్డీ రేటును తక్కువగా చెల్లిస్తున్నారని గమనించిన సిఐటియు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సింగరేణిలో కార్మికులకు అవగాహన కల్పించడంతోపాటు గోదావరిఖని లోని సీఎంపీఎఫ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది. సిఐటియు ఆందోళనలతో దిగివచ్చిన సీఎంపిఎఫ్ అధికారులు సవరించిన వడ్డీ రేటును కార్మికులకు, సింగరేణి అధికారులకు చెల్లించారు. దీంతో అధికారులకు లక్షల్లో లబ్ధి చేకూరగా, సింగరేణి కార్మికులకు సైతం అదేవిధంగా వారికున్న సీఎంపిఎఫ్ లోని డబ్బుల ప్రకారం లబ్ధి చేకూరింది. సిఎంపిఎఫ్ ను ఆన్లైన్ చేయడంలోనూ సిఐటియు కృషి ఎంతో కలదు. మహిళా కార్మికులకు క్రచ్ ఉండాలనే ప్రభుత్వ నిబంధన మేరకు సింగరేణి లోని అన్ని ఏరియాల్లో క్రచ్ ఏర్పాటు చేయాలని భూపాలపల్లి పోరాటం మొదలుపెట్టి, సింగరేణిలోని అన్ని ఏరియాలలో సిఐటియు ఆధ్వర్యంలో  ఆందోళనలు, పోరాటాలు చేయడంతో భూపాలపల్లి, ఆర్జి 3 ఏరియాలో సింగరేణి యాజమాన్యం క్రచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన యూనియన్ లలో సైతం కదలిక వచ్చి, స్ట్రక్చరల్ సమావేశాలలో క్రచ్ ఏర్పాటు చేయాలనే విధంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. త్వరలోనే మందమర్రి ఏరియాలో సైతం క్రచ్ ప్రారంభం కానుంది. క్రచ్ ఏర్పాటుతో చిన్నపిల్లలు గల మహిళా కార్మికులు పని సమయంలో వారి పిల్లలను తీసుకువచ్చి, విధులు నిర్వహించే వెసులుబాటు కలుగుతుంది. దీంతో పాటే సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ ఏర్పాటు చేయాలని చేసిన పోరాట ఫలితంగా అన్ని కార్మిక సంఘాలు సైతం కదలిక వచ్చి, యాజమాన్యాన్ని డిమాండ్ చేయడంతో సీబీఎస్ఈ సిలబస్ ఏర్పాటు చేసే విధంగా యజమాన్యం చొరవ చూపుతూ, ఆర్జి 3 ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులోకి ఈ విద్యాసంవత్సరం నుండి తీసుకువచ్చింది. రానున్న కాలంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికుల పిల్లలకు సింగరేణి పాఠశాలలో సిబిఎస్ సిలబస్ అందుబాటులోకి రానుంది. సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైన సొంతింటి కల, అదే విధంగా మారుపేర్ల అంశంపై ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని లో ఆమరణ నిరాహారదీక్ష నిర్వహించారు. కార్మికుల సొంతింటి కలను సాకారం ఎలా చేయాలనే పూర్తి సమాచారాన్ని గణాంకాలతో సహా సింగరేణి యాజమాన్యానికి, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు నివేదికలు అందజేశారు.  సిఐటియు ఈ పోరాటంతో కార్మికులకు కల్పించిన అవగాహన, చైతన్యంతో కార్మికులు, కార్మిక సంఘాలు, ప్రభుత్వాలు సైతం సొంతింటి కలను నెరవేరుస్తామనే హామీని కార్మికులు ఇవ్వడం జరిగింది. మారుపేర్ల అంశంపై సైతం సింగరేణి వ్యాప్తంగా ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి కార్మికులకు పూర్తి అవగాహన కల్పించి నేటికీ సమస్య పరిష్కారం అయ్యేందుకు పోరాటం కొనసాగిస్తున్నారు. కోలిండియాలో 2011 లో అలవెన్సులపై ఐటి మాఫీ ఒప్పందాన్ని సింగరేణిలో అమలు చేయాలని ఆనాడు గుర్తింపు కార్మిక సంఘం గా ఉన్న టీబీజీకేఎస్, బిఆర్ఎస్ పై ఒత్తిడి తెచ్చేలా 30 వేల మంది కార్మికులతో సంతకాల సేకరణ నిర్వహించి, హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన, వాటిని అధిగమించి, ధర్నాను విజయవంతం గా నిర్వహించారు. ఆనాటి పోరాట ఫలితంగా టీబీజీకేఎస్ తన చివరి స్ట్రక్చరల్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో యాజమాన్యం దీనిపైన మరింత లోతైన సమాచారాన్ని తెలుసుకునేందుకు అధ్యాయం చేయాలని తెలపడంతో ఆ డిమాండ్ అలానే మిగిలిపోయింది. నేటికీ ఆ సమస్య అలానే పరిష్కారం కాకుండా మిగిలిపోయినప్పటికీ సిఐటియు తన ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తూ, అలవెన్సులపై ఐటీ మాఫీ చెల్లించేలా తన పోరాటాలను కొనసాగిస్తుంది. దీర్ఘకాలిక దృష్టితో కార్మికుల సంక్షేమం కొరకు సిఐటియు పోరాటం చేయడమే కాకుండా దానిపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతుంది. సిఐటియు నాటి నాయకులు ఏదైతే ఐక్య పోరాటాల మార్గాన్ని చూపెట్టారో, నేటి సిఐటియు నేతలు సైతం ఆ ఆ మార్గం లోనే పయనిస్తూ, ఆ సిద్ధాంతాలను ఆచరిస్తూ, అదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. సింగరేణిలో రోజురోజుకు కార్మికుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ నూతనంగా చేరుతున్న యువ కార్మికులు సిఐటియు పోరాటాలను గమనించి, యూనియన్ ను ఆదరిస్తూ, పెద్ద ఎత్తున యువ కార్మికులు సిఐటియు లో చేరడంతో యూనియన్ కు మరింత బలం చేకూరుతుంది. రాబోయే కాలంలో సిఐటియు కార్మికుల ఆదర అభిమానులను చొరగోనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి