
*ఉదయక్రాంతి* :- మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి సభ్యుల ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి లతో కలిసి నోడల్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎన్నికల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, శాసనమండలి సభ్యుల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలను జిల్లాలో భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నిక కొరకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నిక కొరకు 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తదనగుణంగా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారుల జాబితా తయారు చేయాలని, పోలింగ్ పర్సనల్, సెక్టార్ అధికారులకు డిస్పాచ్ అండ్ రిసెప్షన్ శిక్షణ అందించాలని, ప్రతి పోలింగ్ కేంద్రం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేలా చూడాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలవుతున్న సందర్భంగా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ క్రింద చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సామాగ్రి పంపిణీ, రిసీవింగ్ కౌంటర్, అనౌన్స్మెంట్ స్టేజ్ 1 క్రింద ఆర్ఓ, ఏఆర్ఓ , స్టేజ్ 2 లో ఆర్ఓ లను త్వరగా నియమించాలని, ఫిబ్రవరి 10న ఉదయం స్టేజ్ 1 ఆర్ఓ, ఏఆర్ఓ లకు, మధ్యాహ్నం స్టేజ్ 2 ఆర్ఓ లకు మాస్టర్ ట్రైనర్ల తో తమకు కేటాయించిన విధుల నిర్వహణపై శిక్షణ అందించాలని తెలిపారు. పోలింగ్ పర్సనల్ (పిఓ, ఏపీఓ) లకు సంబంధించిన డాటా ఎంట్రీ పూర్తయిందని, వారికి కేటాయించిన మండలాలలో బ్యాచ్ లుగా విభజించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారుల సహాయంతో శిక్షణ ఇవ్వాలని సూచించారు. సంబందిత తహశీల్దార్, మండల ప్రత్యేక అధికారులు, మండల పంచాయతీ అధికారులు ప్రత్యక్షంగా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని, పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ భవనాలలోనే ఉండేలా చూడాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీరు, పారిశుధ్యం, మూత్రశాలలు, నిరంతర విద్యుత్ సరఫరా ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో అవసరమైన బ్యాలెట్ బాక్సుల సంఖ్య సరి చూసుకోవాలని, మరమ్మతులు, పెయింటింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఫిబ్రవరి 15లోగా అధికారులు, సిబ్బంది శిక్షణ కార్యక్రమం మండల కేంద్రాలలో మండల ప్రత్యేక అధికారుల సమక్షంలో పూర్తి చేయాలన్నారు. రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని, కమ్యూనికేషన్ ప్లాన్ లో భాగంగా పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, తహశీల్దార్, రాజస్వ మండల అధికారులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఇతర అధికారుల కాంటాక్ట్ వివరాలు నమోదు చేయాలని తెలిపారు. జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సైతం నోడల్ అధికారులను నియమించడం జరిగిందని, ఆర్ఓ, ఏఆర్ఓ ల జాబితా సిద్ధంగా ఉందన్నారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత సంబంధిత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సమావేశాలు నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.